ఇది రెండు మేకల్ని 60 మేకలు చేసిన మాంత్రికుడి కథ. ఇదేదో మాయలు మంత్రాలతో మేకల సంఖ్యని పెంచిన మాంత్రికుడి కథకాదు. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆర్ధిక సాయంతో రెండు మేకలను పొంది, వాటిని క్రమంగా అరవై మేకలకు పెంచిన శ్రామికుడు కొమర ముత్తా కథ. ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో జాలం తాండా, కొలాం గూడా జంట పల్లెలు.

ఏకలవ్య ఫౌండేషన్‌ నాబార్డు సాయంతో అమలు చేసిన వాటర్‌షెడ్‌ పథకం ద్వారా ఈ రెండు గ్రామాల్లోని బీడు భూములు సాగులోకి వచ్చాయి. అక్కడ భూమిలేని రైతులకు వారి జీవనోపాధుల కోసం నాబార్డు ద్వారా రుణాలు ఇచ్చారు. అలా రుణం పొందిన కొమర ముత్తా రెండు మేకలను కొన్నాడు. వాటిని అడవుల్లోకి తీసుకెళ్లి మేపుతూ, శ్రద్ధగా పోషించిడం వల్ల క్రమంగా అవి అరవై సంఖ్యను దాటాయి. చేతికి అంది వచ్చిన మేకలను అమ్ముకుంటూ అతడు స్వయం సమద్ధిని సాధించాడు.

ఇప్పుడా పేద గిరిజనుడికి ఆర్థిక ఇబ్బందులు లేవు. అప్పులు లేవు. అతడికి మేకలను ఇవ్వడంతోపాటు వాటి ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతను కూడా ఏకలవ్య ఫౌండేషన్‌ తీసుకుంది. ప్రతి వారం ఒక పశువైద్యుడు మేకల ఆరోగ్యాన్ని పరిశీలించి, అవసమైన జాగ్రత్తలు సూచిస్తాడు. మేకలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే కొమర ముత్తా తన కూతురికి ఈమధ్యే మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు..

– గీత. ఆర్గానిక్‌ ట్రైనర్‌, ఏకలవ్య అకాడమీ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌