ప్రకృతి సాగుకు ప్రత్యక్ష ఉదాహరణ తిరుమలశెట్టి నాగరాజు. సాగు చేయడమేకాదు, పంటలకు కావాల్సిన ద్రావణాలను స్వయంగా ఇంట్లోనే తయారుచేస్తాడు. వాటిని ఇతర రైతులకు అందిస్తాడు. పండించిన కూరగాయలను దళారుల ప్రమేయం లేకుండా తనే స్వయంగా అమ్ముకుంటూ తోటి రైతులకు మార్కెట్‌ నైపుణ్యం నేర్పుతున్నాడు. ఈ రైతు పొలంలో పండిన సేంద్రియ వంకాయల రుచి కోసం కడపజిల్లా చుట్టు పక్కల నుండి బయనపల్లి గ్రామానికి వినియోగదారులు క్యూ కడతారు. నాగరాజు సేంద్రియ పంటల డిమాండ్‌ వెనుక అతడి స్వయంకృషి ఉంది.

నేను ఒకపుడు రసాయన ఎరువులతో పంటలు పండించిన వాడినే, కానీ రోజు రోజుకీ పెట్టుబడి పెరిగి పోతుండటం వల్ల ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను.’ ఏకలవ్య ఫౌండేషన్‌ ‘ఇచ్చిన శిక్షణ, ఆత్మవిశ్వాసంతో మూడున్నర ఎకరాల్లో వంకాయలు, టమాటా మిర్చి, ఆకుకూరలు పండిస్తున్నాను.

ఇంట్లోనే పులివైజర్‌ యంత్రంతో వేపగింజల, ఉమ్మెత్తల కాషాయాలు తయారు చేసి పంటలకు వాడుతున్నాను. రైతులందరికీ ఈ ద్రావణాలు అందించడం కోసం ఒక ఎస్‌పిఎమ్‌ షాపు నిర్వహిస్తున్నాను. ప్రకృతి సాగుకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. మామమాత్రపు పెట్టుబడితో ఏడాదికి రూ. 2 నుండి 3 లక్షల వరకు కూరగాయల అమ్మకంపై ఆదాయం వస్తోంది” అని సంతోషం వ్యక్తి చేశాడు సికె దిన్నె మండలం (కడపజిల్లా) కు చెందిన నాగరాజు.